మొదటి పెజి
 పిఎఆర్/పిఆర్ఎ




అనువాదములు:

'العربية / al-ʿarabīyah
বাংলা / Baṅla
Català
中文 / Zhōngwén
Deutsch
English
Español
Filipino/Tagalog
Français
Ελληνικά / Elliniká
हिन्दी / hindī
Italiano
بهاس ملايو / Bahasa Melayu
Polszczyzna
Português
Română
తెలుగు /Telugu
Tiếng Việt

                                        

మిగితా పాజీలు

విభాగాలు

స్థల పటములు

ముఖ్యమైన పదాలు

సంప్రదించ వలసిన చిరునామా

అవసరమైన పత్రాలు

అవసరమైన అనుసందానములు


పిఆర్ఏ ద్వారా సంతోషాన్ని పంచుకోవడము

నేపాల్

రచన కమల్ ఫూయాల్

సంపాదకులు ఫిల్ బార్ట్లే, పీహెచ్డీ

అనువాదకులు పి. నిరుపమ ప్రతాప రెడ్డి


“శిక్షణ తీసుకుంటున్న వారు శిక్షణలో చెప్తున్నదాని మీద శ్రద్ధ చూపించరు, కానీ శిక్షకుని ప్రవర్తనని గమనిస్తూ వుంటారు – అంటే శిక్షకుని ప్రవర్తన అతను క్లాసులో నేర్పిస్తున్నదానికి అనుగుణంగా వుందా లేదా అని. అంతేకాకుండా శిక్షణలో పాల్గొంటున్న వారు, తాము నేర్చుకున్నది ఆచరణలో ఎప్పుడు పెడతారు అంటే వారికి శిక్షకుని ప్రవర్తనపై నమ్మకం కలిగినప్పుడు”
(ఉత్తమ్ డాక్వ గారు, దైవత్వమును మరియు అభివృద్ధిని పంచుకొనుట మీద సమాఖ్య)

పిఆర్ఏను ఎందుకు వాడాలి? ఇదే ప్రశ్న వివిధ సమావేశాల్లో (శిక్షణా తరగతులు మరియు పనిని నేర్పించే తరగతులలో). లేవనెత్తబడింది. నా ఆనుభవంలో నేను పిఆర్ఏ యొక్క మూడు ముఖ్యమైన అంశాలను చూసాను; వైఖరి మరియు ప్రవర్తన అంశము, ఉద్దేశము లేదా లక్ష్యము గురించిన అంశము, మరియు ప్రక్రియ (పనిముట్లను ఉపయోగించుట) లేదా నైపుణ్యము యొక్క అంశము. ఆ మూడవ అంశము ఏదైతే పనిముట్లను ఉపయోగించుట మీద వుందో అది చాలా ఖచ్చితముగా ఉన్నట్టువుంది. శిక్షణ అన్నది చాలా వరకు ఇదే అంశము మీద కేంద్రీకరించబడింది అనే ఒక వ్యాఖ్య వుంది. శిక్షణ అన్నది పిఆర్ఏ అన్న దాని యొక్క చరిత్ర నుండి మొదలయ్యి పని ముట్ల ఉపయోగముతో ముగుస్తుంది.

మొదటి భాగం పిఆర్ఏను ఎవరు ఉపయోగించాలి? అన్న ప్రశ్న గురించి శోదిస్తుంది. పిఆర్ఏను ప్రాక్టీసు చేసే వాడికి కావలసిన స్వభావాలు ఏమిటి. రెండవ ప్రశ్న ఏమిటంటే పిఆర్ఏను ఎందుకు వాడాలి – ఇతర పని ముట్లను ఎందుకు కాదు? పిఆర్ఏ తాలూకూ విలువలు ఏమిటి? అలాగే మూడవ అంశము పనిముట్లను ఎలా ఉపయోగకరముగా వాడుకోవాలి? దానిని వాడవలసిన పధ్ధతి ఏమిటి? అన్న అంశాల మీద దృష్టి కేంద్రీకరిస్తుంది.

ఒక ప్రాంతములోని ప్రజలు పాల్గొనటం అన్నది పిఆర్ఏ సమన్వయకర్త యొక్క వైఖరి మీద ఆధారపడివుంటుంది.

అభివృద్ధి అంటే సంతోషాన్ని పంచుకోవడము

నా సహోద్యోగి ఒకతను నాతో ఇలా చెప్పాడు, “అభివృద్ధి అంటే ఏమిటో నీకు తెలుసా? నా అనుభవము ప్రకారం అది ఇతరులతో మన సంతోషాన్ని పంచుకోవడము.” అని అతని అనుభవములోకి వచ్చిన వివిధ ఉదాహరణలతో అతను ఆ విషయాన్ని నాకు వివరించాడు, అభివృద్ధి గురించి అతని ఉద్దేశ్యము నాకు నచ్చింది.

అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టుల గురించి తెలుసుకోవడానికి మరియు వాటిని చూడటానికి నాకు చాలా అవకాశాలు వచ్చినవి. ఒక సారి నేను దగ్గరలో వున్న పోఖర అనే పల్లెటూరుకి వెళ్ళాను, అది కాట్మండుకి 200 కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలో వుంది. అక్కడ మేము ఒక తాగు నీటి ప్రాజెక్ట్ యొక్క సాధ్యాసాధ్యాలను పాల్గొనుట ప్రక్రియల ద్వారా అంచనా వేస్తున్నాము. అక్కడ మాకు ఎంతో బాగా అనిపించింది; ఆ పల్లె ప్రజలతో మేము చాలా పంచుకోగలిగాము, ఆ పల్లె ప్రజలు కూడా మేము వారి గ్రామమునకు రావడంతో చాలా - చాలా సంతోషించారు. డబ్బు పరంగా చెప్పాలీ అంటే అది చాలా చిన్న ప్రాజెక్టు. గవర్నమెంట్ తాలూకా నీటి పారుదల జిల్లా శాఖ మరియు ఒక జపాన్ సంస్థ ఆ ప్రాజెక్టును జంటగా చేపట్టాయి. ఆ ప్రాజెక్టును పూర్తి చేయడానికి వారు 35,000 రూపాయలు ఖర్చుచేశారు. అక్కడ వున్న ఆడవారు ఆ ప్రాజెక్టు గురించి కొన్ని విషయాలను మాతో పంచుకొన్నారు:

ఒక అక్క మా గ్రామములో పని చేయడానికి వచ్చింది. ఆమెను మేము చాలా కాలము పట్టించుకోలేదు. మీకు తెలుసా, మొదట్లో ఆ గ్రామస్తులు ఆమెను అక్కడినుంచి వెళ్ళిపోమన్నారు (కొంత మంది అభివృద్ధి గురించి పని చేయడానికి వచ్చిన వారితో, ఇంతకు ముందర, ఆ గ్రామస్తులకు కొన్ని చేదు అనుభవాలు కలిగినవి) కానీ, ఈమె రాత్రింబవళ్ళు ఆ గ్రామస్తుల సమస్యలను ఎలా పరిష్కరించాలి అనే ఆలోచించేది. ఆమె ఎంతో మంచిది. చివరికి మాకు ఆమె ఎంతో నచ్చింది, మేమందరం కలిసి పనిచేసి ఎన్నో పనులను పూర్తి చేసాము. ఇప్పుడు మాకు మా సహకార సంఘాలు వున్నాయి. మేము అక్షరాస్యతా తరగతులను చేపట్టాము. ఆమెతో మేము చాలా బాగా మా సమయాన్ని వెచ్చించాము. అందరమూ కలిసి పనిచేస్తునప్పుడు మేము చాలా సంతోషముగా వున్నాము మరియు చాలా ఆనందించాము. మీకు తెలుసా, మేము మా పనులను ఎంతో సంతోషముతో పూర్తి చేసాము. ఆ రోజులు గుర్తు చేసుకుని మేము ఈ రోజు కూడా చాలా ఉత్తెజితులమవుతాము. మాకు మా ప్రాజెక్టు అంటే ఎంతో ఇష్టము మరియు దానిని మేము ఎప్పటికి చావనివ్వము.

ఆ గ్రామస్తులు ఆయా సంస్థల పేర్లను కూడా సరిగ్గా ఉచ్చరించలేరు; వారు మళ్ళీ మళ్ళీ చెప్పినదేమిటంటే ఆ అభివృద్ధి గురించి పనిచేసిన అక్కతో వున్నప్పుడు మేము చాలా సంతోషముగా వున్నాము అని. దురదృష్టవశాత్తూ మేము ఆ అక్కను కలుసుకోలేకపోయము, కానీ ఆమె గురించి తెలుసుకునప్పుడు, మాకు తెలిసినది ఏమిటంటే ఆమెకు ఈ గ్రామీణ ప్రాంత మహిళలతో పనిచేయడము ఎంతో సంతోషముగా అనిపించేది అని. మాకు తెలిసినది ఏమిటంటే ఆమె ఏకైక లక్ష్యము సంతోషాన్ని నలుగురితో పంచుకోవడము అని. గ్రామస్తులు మరియు ఆ అక్క సంతోషాన్ని పంచుకున్నారు. సంతోషాన్ని పంచుకోవడానికి వారికి దొరికిన ఒక పధ్ధతి ఆ నీటి ప్రాజెక్టు మీద పనిచేయడము. ఆ సంతోషమే ఆ ప్రాజెక్టును విజయవంతము చేసింది. ఆ గ్రామస్తులు ఆ ప్రాజెక్టు మీద ఎంత ఖర్చయ్యింది అన్న విషయము పట్టించుకోనూలేదు చివరికి వారికి గుర్తు కూడా లేదు. వెల నిశ్చయించే సమయములో వారు మాటి మాటికీ తాము ఎంత సంతోషముగా వున్నారో అది మాత్రమే గుర్తు తెచ్చుకుంటూ వున్నారు. వారి సంతోషము వారిని ఇతర పనులను చేయడానికి ఉత్తేజితులను చేసింది. ఇప్పుడు వారికి వారి సొంత సహకార సంఘము వుంది, ఒక బాగోగులు చూసే కమిటీని ఆడవాళ్ళ మధ్య ఏర్పాటు చేసుకున్నారు. వారికి పొదుపు సంఘాలు వున్నాయి. “గుంపులో ఒక సభ్యునిగా వుండడం మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది, మేము ఇక్కడికి వస్తాము, మా సమస్యలు ఇతరులతో పంచుకుంటాము, నిజముగా చెప్పాలి అంటే అక్కడ మా ఆనందాన్ని మేము అందరితో పంచుకొంటాము” అని వారు మాకు చెప్పారు.

ఒకానొక అతి పెద్ద బహుళ జాతి సంస్థ 15 లక్షల రూపాయలు ఖర్చుపెట్టి నువకోట్ జిల్లాలోని (కాట్మండుకు ఉత్తర దిక్కున వున్న ఒక భాగము) ఒక గ్రామములో ఒక తాగు నీటి ప్రాజెక్టును చేపట్టింది. అయినా కూడా ఒక గ్రామీణ అభివృద్ధి కమిటీకి, ఏదైతే సుమారు 800 కుటుంబాలను (చాలా గ్రామాలను కలిపి) కలుపుతుందో, అయిదు లక్షల రూపాయలు మాత్రమే వార్షిక బడ్జెట్ క్రింద గవర్నమెంట్ నుండి వస్తుంది. అలాగే ప్రాజెక్ట్ కి మరియు గ్రామస్తులకు మధ్య చాలా పెద్ద తగాదా వుంది. ఇంతకు ముందర చాలా దూరం నుండి నీళ్ళు తెచ్చుకోవలసి వచ్చేది, అలాంటిది ఈ ప్రాజెక్టుతో ఆ సమస్యకు పరిష్కారం దొరికినట్టు అవుతుంది, అయినా కూడా గ్రామస్తులు ఆ ప్రాజెక్టుతో సంతోషంగా లేరు. ఆ ప్రాజెక్టు గురించి గ్రామస్తులు ఇలా విశ్లేషించి చెప్పారు:

ఆ ప్రాజెక్టు నిర్మాణము దాదాపు పూర్తి కావచ్చింది, కానీ మాకు ఆ ప్రాజెక్టులో పనిచేసే వారు ఎవరూ కూడా తెలియదు. వారు పని చేసే వారిని ఎప్పుడూ మారుస్తూ వుంటారు. ఒక సారి చూసిన వారిని మళ్ళీ రెండో సారి ఎప్పుడూ చూడలేదు. ఇది మా ప్రాజెక్టు అని మేము భావించడం లేదు. వారు ఒక కార్య నిర్వాహణా సంఘాన్ని తయారు చేసారు అని విన్నాము. కానీ అందులో ఎవరెవరు వున్నారో మాకు తెలియదు. రాజకీయ నాయకులలో ఎవరో ఆ కమిటీలో ఉండుండవచ్చు. ఆ పని చేసే వారికి ఇక్కడ ఆఫీసు లేదు అలాగే వుండడానికి ఒక ఖచ్చితమైన స్థలము కూడా లేదు. వారు ఈ ప్రదేశాన్ని చూసిన తరువాత ఎప్పుడూ కాట్మండుకి లేదా త్రిశూలీకి (జిల్లా ప్రధాన కార్యాలయము) వెళ్ళిపోతూ వుంటారు. చుట్టు ప్రక్కల ఏదో గ్రామములో వున్న ఒక కాంట్రాక్టరు ఈ నిర్మాణము యొక్క భాద్యతను తీసుకున్నాడు. మేము ఒక సారి పని చేసే వారిని కలవడానికి వెళ్ళాము, వారు మాతో ముచ్చటించడానికి ఇష్టంగానే వున్నారు అనిపించింది.

ఆ గ్రామస్తులు దగ్గరలో వున్న ఒక చెరువు నుంచి చాలా ఏళ్ళ నుండీ నీళ్ళు తెచ్చుకుంటున్నారు; భవిష్యత్తులో కూడా అలానే తెచ్చుకోగలరు. ఆ గ్రామస్తులను వారికి కావలసినదేమిటి అని అడగలేదు; వారు నిజముగా ఆలోచిస్తున్నదేమిటి అని. బయటనుండి వచ్చిన వారు పధకము మీద పని చేసారు మరియు కొంత మంది మనుషులు ఎవరికైతే నీటి సమస్యలేదో వారిని తీసుకు వచ్చి వారితో ఆ పని చేయించారు. మేము ఇక్కడ చూసినదేమిటంటే ఆ ప్రాజెక్టు సంతోషాన్ని పంచుకోవడానికి ఒక మాధ్యమము కింద లేదు. గ్రామములోకి ప్రాజెక్టు వచ్చిన రోజు నుంచీ కూడా గ్రామస్తులకు మరియు ప్రాజెక్టులో పని చేసే వారికీ మధ్య అగాధం పెరుతూ పోయింది. ప్రాజెక్టుని ఆ గ్రామానికి తీసుకురావడం వల్ల ఆ గ్రామం పట్ల తామేదో దయ చూపుతున్నాము అనే భావన ప్రాజెక్టులో పని చేసే వారిలో వుంది. వారు వారి సమయములో కొంత భాగాన్ని తీసి గ్రామస్తులతో మాట్లాడడానికి ఇష్టపడటం లేదు; వారు గ్రామస్తులతో మాట్లాడకపోతే వారు వారి సంతోషాన్ని ఇతరులతో ఎలా పంచుకోగలరు?

మన చరిత్ర మనకి ప్రజలు కలిసిగట్టుగా పాల్గొని తమకి తాముగా చేపట్టిన పనుల గురించి చాలా కథలు చెబుతుంది. ప్రజలు గుళ్ళు, రోడ్లు, బావులు మరియు చెరువులు, పాఠశాలలు మరియు అలాంటివి ఇంకొన్ని నిర్మించిన ధాకలాలు కనబడతాయి. వారు ఇవన్నీ కూడా ఏదో పండగ జరిపినట్టు జరిపేవారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అని గనక మీరు విశ్లేషించి చూస్తే మీకు తెలిసేది ఏమిటంటే సంతోషాన్ని పంచుకోవడం అన్నది వారికి ప్రేరణనిచ్చింది అని. వారు పాటలు పాడుకొనేవారు, సామాజిక పనులను కలిపి చేపట్టేవారు, విందులలో భోజనము ఒకరితో ఒకరు పంచుకొనే వారు, నవ్వుకొనేవారు మరియు ఆనందిస్తూ తమ పనిని తాము పూర్తి చేసేవారు. ఏమి అనిపిస్తుందంటే, కొన్ని సార్లు ఇతరులకు ఏదైనా ఇచ్చి సంతోషించేవారు, కొన్ని సార్లు ఇతరుల నుండి ఏదైనా పొంది ఆనందించేవారు, మరికొన్ని సార్లు ఒకరితోఒకరు ఏదైనా పంచుకొని సంతోషించేవారు అని.

ఒక సారి ఒక బాగా పెద్ద సంస్థ నా సహోద్యోగికి ఒక ఉద్యోగాన్ని ఇవ్వడానికి సిద్దపడినది. ఆమె దాని గురించి చాలా ఆలోచించింది, ఇతరులతో దాని గురించి పంచుకొంది చివరికి ఆ అవకాశాన్ని వదిలేసుకుంది. ఆమె చెప్పినదేమిటంటే:

ఆ కొత్త చోట నాకు ఇక్కడవున్నంత “సంతోషకరమైన వాతావరణము” దొరుకుతుందో లేదో. ఇక్కడ వున్న సహోద్యోగులతో పని చేయడం మరియు వారితో నా సంతోషాన్ని పంచుకోవడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇక్కడ నా పనిని నేను ఆనందిస్తున్నాను. అవును అక్కడ నాకు రెట్టింపు జీతము మరియు వసతులు ఇస్తూవుండవచ్చు కానీ నా ఆనందాన్ని నేను కోల్పోతానేమో అని భయముగా వుంది.

పిఆర్ఏ ద్వారా ఆనందాన్ని పంచుకోవడము

పిఆర్ఏ తాలూకూ శిక్షణా తరగతులు మాకు ఎప్పుడూ నిస్తేజముగా అనిపించలేదు. ఈ మధ్యకాలంలోనే నేను 60 శిక్షణా రిపోర్టులను విశ్లేషించి చూసాను. శిక్షణా తరగుతలకు చివరలో అభ్యర్దులు ఇచ్చే విశ్లేషణా రిపోర్టులను చదివాను. ఒక రిపోర్టులో కూడా ఎవరూ పిఆర్ఏ శిక్షణా తరగతులు నిస్తేజముగా వున్నాయి అని అనలేదు. మీకు వారందరూ ఇలా చెప్తూ కనపడుతుంది: “పది రోజులు పది నిమిషాల్లా గడిచిపోయాయి”, “శిక్షణా కార్యక్రమం మొత్తము ఆటలాడినట్టు అనిపించింది,” “మాకు నిస్తేజముగా అనిపించలేదు”, “మేము చాలా నవ్వుకొన్నాము”, “మేము చాలా పంచుకొన్నాము,” ఇంకా ఇలాంటివే కొన్ని. పిఆర్ఏ పద్ధతుల ద్వారా నేర్చుకొనే అంశములే ఇతర మాధ్యముల ద్వారా కూడా నేర్చుకోవచ్చు. కానీ నా అనుభవము ప్రకారము పిఆర్ఏ ఆనందాన్ని పంచుకోవడానికి ఒక వాతావరణాన్ని కల్పిస్తుంది. పాల్గొనే వారికి వివిధ స్థాయిలు కనపడవు (అంటే ఒకరి కింద ఒకరు పనిచేయడము వారి కింద ఇంకొకరు పనిచేయడము లాంటి పధ్ధతి); వారికి అసమానతలు కనపడవు (సామాజిక-ఆర్ధిక, కులము, లింగ భేదాలు). వారందరూ నవ్వుకుంటారు, నేర్చుకుంటారు మరియు పంచుకుంటారు. ఆనందాన్ని పంచుకోవడం వలన వారి మధ్య ఒక మానసిక అనుబంధము ఏర్పడుతుంది. శిక్షణలోగానీ ఆచరణలో కానీ పిఆర్ఏ వలన చివరగా వచ్చే ఫలితము అదే.

“మీకు తెలుసా, సామాజిక పటము తయారు చేస్తునప్పుడు గ్రామస్తులు రాళ్ళను, కర్రలను అటూ ఇటూ కదిలించి ఇళ్లను తయారు చేస్తారు. వారికి మొదట 15 నిముషాల పాటు తమ గ్రామ పటమును లేదా ఒక కృత్రిమమైన పటమును గీస్తున్నామని గుర్తుంటుంది. తరువాత వారు రాళ్ళతోను మరియు ఇతర సామానుతోను ఆడుకుంటున్న సంగతి మర్చిపోతారు. దాని తరువాత వారు వాస్తవంలోకి దిగుతారు. అరుస్తారు, నవ్వుతారు, బయటకి మాట్లాడుతారు మరియు కొన్ని సార్లు కోపోద్రేకులు కూడా అవుతారు. కాబట్టి నాకు ఏమి అనిపిస్తుందంటే 15 నిముషాల తరువాత వారు ఒక నిజమైన విశ్లేషణ మరియు చర్చా కార్యక్రమంలోకి దిగుతారు మరియు అప్పుడే ఆనందాన్ని పంచుకొనే క్షణము మొదలవుతుంది. ఎప్పుడైతే కృత్రిమముగా జరుగుతున్న ప్రక్రియ అంతమయ్యి ఆనందం పంచుకొనే క్షణం మొదలవుతుందో అప్పుడే పక్కన నించున్న ఇతర గ్రామస్తులు కూడా అభ్యాసములో పాల్గొనటం మొదలుపెడతారు. అక్షరాస్యత లేనివారు మరియు అణగారిన వర్గాలకు చెందిన వారు ఎవరైతే ప్రజా వేదికల్లో మాటాడటానికి సందేహిస్తారో వారు కూడా పాల్గొనటం మొదలుపెడతారు. ఆనందాన్ని పంచుకోవడం అన్నది ప్రక్రియను సులభతరము చేస్తుంది.”
ఒకానొక పిఆర్ఏ సమన్వయకర్త మాతో ఒక సారి పంచుకున్నది.

కానీ పిఆర్ఏ ‘ఆనందం పంచుకోవడం’ అన్న అంశము లేకుండా జరిగితే మాత్రం చాలా నిస్తేజముగా మరియు చాలా శాస్త్రీయంగా జరుగుతుంది. కొన్ని సార్లు అది హానికరమైనదాని కింద కూడా అవుతుంది. ఒక సారి ధాడింగ్ జిల్లాలోని (కాట్మండుకి ప్రక్కనే వున్న జిల్లా) ఒక వీడీసీలోని (గ్రామీనాభివృద్ధి కమిటీ) కొంత మంది అధ్యక్షులు (చైర్ పర్సన్స్) ఒక ‘పిఆర్ఏ గుంపును’ చూసిన అనుభవాన్ని పంచుకున్నారు:

“పిఆర్ఏ ప్రక్రియను పాటించే గుంపు ఒకటి నలుగురైదుగురు కూలీలతోటి తమ విడిది సామాను మరియు తినుబండారాలు మోయించుకుంటూ మా గ్రామానికి వచ్చారు. గ్రామానికి చేరుకున్న తరువాత కొంతమంది కోళ్ళను పట్టుకోవడానికి పోయారు, మరి కొంతమంది సాయంత్రం బోగి మంట వేయడానికి చెట్ల కొమ్మలు కొట్టి తీసుకురావడానికి పోయారు. కొంతమంది యువకులు నీళ్ళ పుంపు దగ్గరకి పోయి గ్రామములోని యువతులను ఏడిపించడం మొదలుపెట్టారు. ఆ సాయంత్రం ఒక పెద్ద సాంస్కృతిక కార్యక్రమం చేపట్టారు. ఇంగ్లీషు పాటలు పెట్టుకుని డిస్కో డాన్స్ చేయడం మొదలుపెట్టారు. గట్టిగా అరవడం మొదలుపెట్టారు. ఆ డాన్స్ (నృత్యం) ఎప్పుడు ఆగింది అంటే ఆ గుంపులో ఇద్దరు తాగుబోతులు తన్నుకోవడం మొదలుపెట్టిన తరువాత. మరుసటి రోజు ఉదయం ఒక ఏదెనిమిది మందిని మాత్రమే పోగేయగలిగారు, అందులో కూడా ముగ్గురు వీరు బస చేసిన ఇంట్లోని వాళ్ళే. చివరికి అలా ‘పిఆర్ఏ కార్యక్రమం చేపట్టారు’.”

ఇలాంటి ఎవరూ పాల్గొనని పిఆర్ఏ మూలంగా ఆనందం పంచుకోవడం అన్నది జరగదు కానీ అది ప్రజల యొక్క సంతోషాన్ని హరిస్తుంది. పైపెచ్చు ఇలాంటి పిఆర్ఏ అభ్యాసాలు ఏవైతే స్వార్ధ లాభాలను ఆశించి చేపడతారో అవి పిఆర్ఏ యొక్క విలువలను దిగజారుస్తుంది.

పిఆర్ఏతో మనం ఏమైతే చేయగలమో అవన్నీ ఇతర పద్ధతుల ద్వారా కూడా చేయవచ్చు. ఇతర పద్ధతులు కూడా సంఘములోని ప్రజలను పాల్గొనే విధముగా ఉత్తెజపరచగలవు. అక్షరాస్యతలేని వారిని మరియు అణగారిన వర్గాలకు చెందినవారిని ఇతర పద్ధతుల ద్వారా అభివృద్ధి ప్రక్రియలో పాల్గొనే విధముగా ఉత్తెజపరచవచ్చు. కానీ, పిఆర్ఏ వల్ల వచ్చే లాభం ఏమిటంటే ఇది ఒక సంతోషకరమైన సుహృద్భావ వాతావరణనాన్ని పెంపొందిస్తుంది.

ఒకసారి సింధుపాల్ చౌక్ జిల్లాలోని (అది కాట్మండుకి ఈశాన్యంలో వుంది) ఒక గ్రామములో ప్రజలు ఎంత బాగున్నారు అనే దాని మీద సమీక్ష జరిగింది. గ్రామస్తులలో కొంతమంది ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. వారు ఒక ముసలతన్ని ‘తక్కువ స్థాయిలో (బీదవాడు)’ వాడి కింద నమోదు చేసుకున్నారు. అతను అక్కడే మిగతా వారితో కలిసి వున్నాడు. అతను తను బీదవాడిని అని వొప్పుకోలేదు. ఇదే విషయం మీద చాలా సేపు చర్చ జరిగింది. మిగతావారు అతను బీదవాడే అని నిరూపించడానికి చాలా ఉదాహరణలను చూపించారు. అందరి వుద్దేశ్యము అతనికి సహాయము చేయాలి అని, ఎందుకంటే వారు చేపడుతున్న ఆ ప్రాజెక్టు బీద వారికి సహాయము చేసేది. ఆ ముసలతను ఏమీ లేని వాడు. రోజుకు రెండు పూటలు గడవటం కూడా కష్టంగా వుండేది అతనికి. అతను ఇలా అన్నాడు - “నాకు సరిపడేటంత తిండి వుండకపోవచ్చు, కానీ నేను సంతోషంగా వున్నాను. ఈ గ్రామములోని అందరికంటే నేనే ఎక్కువ సంతోషముగా వున్నాను. నన్ను మీరు ఎప్పుడైనా ఉదాసీనంగా చూసారా? అలాంటప్పుడు మీరు నన్ను బీదవాడిగా ఎలా పిలువగలుగుతారు?” నిజముగా చెప్పాలి అంటే ఏదైనా సామాజిక కార్యక్రముమము జరుగుతూ వుంటే ఇతనే వాటిల్లో మొదట పాల్గొనేవాడు లేదా నాయకత్వము వహించేవాడు. చివరికి మిగతావారు అతనిని ‘మధ్య స్థాయిలో’ నమోదు చేసుకున్నారు.

అభ్యాసము పూర్తిచేసిన తరువాత ఆ పెద్దతనితో చాలా సేపు మాట్లాడాము. మాకు తెలిసిందేమిటంటే అతని సంతోషానికి ఆధారము అతనిలోనే వుంది అని. అతను గనక కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్తే గ్రామస్తులందరికీ అతను లేని వెలితి తెలుస్తుంది. పిఆర్ఏ సభ్యులందరూ దీని నుండి నేర్చుకున్నది ఏమిటీ అంటే మౌలిక అవసరాలు (కనీసం) అన్నవి అందరు మనుషులకూ ముఖ్యమే, ఆకలి మనిషి ఆనందానికి అడ్డంకిగా మారవచ్చు. కానీ ఆర్ధికంగా బాగా వుండడం అన్న అంశాన్ని మానసిక ఆనందంతోను మరియు ఆత్మానందంతోను పోల్చిచూడలేము.

పోయిన నెల అభివృద్ధి మీదా మరియు దైవత్వము మీదా మా మధ్య చర్చ జరిగింది. ఎవరో అడిగారు “సంఘములోని అణగారిన వర్గాలను శక్తివంతము చేయడము గురించి ఏమి చేయాలి?” ఆనందం ఎవరితో పంచుకోవాలి? ఆ చర్చకి కొన్ని ముగింపులు ఏమిటంటే:

“అవును, మాకు న్యాయము కావాలి, మాకు అసమానతలు వద్దు, మాకు ఎదుట వారిని దోపిడీ చేసే వ్యవస్థ వద్దు మరియు మాకు ‘శక్తిహీనులను శక్తివంతముగా చేయడం’ కావాలి. అందుకే ఈ అభివృద్ధి ప్రక్రియలో సంఘములోని అణగారిన వారు పాల్గొనటం మాకు కావాలి. మేము వారు చెప్పేది వినాలనుకుంటున్నాం. వారి భావాలను/ఉద్దేశాలను తెలుసుకోవాలనుకుంటున్నాం. ఈ శక్తివంతముగా తయారు చేయు ప్రక్రియలో మేము వారి స్నేహితులుగా ఉండాలనుకుంటున్నాం. ఇది మా ఉద్యోగం కనుక మేము ఇది చేయాలి అనుకోవటంలేదు, ఇది చేయటం మూలాన మేము ఎంతో ఆనందం పొందుతాము, అందుకే దీనిని చేయాలి అనుకుంటున్నాము. వారు ‘పైకి లెగాలి’ అని మేము అనుకుంటున్నాము, మరియు వారి మధ్య అసమానతలు తగ్గాలి. ఈ శక్తివంతముగా చేయు ప్రక్రియలో మేము వారికి సహాయపడటం వలన మేము సంతోషిస్తాము మరియు మేము వారి స్నేహితుల కింద వుంటాము అని వారు నమ్మే విధముగా చూడాలి. ఈ విధముగా వారితో మా ఆనందాన్ని పంచుకొంటాము. ఒక్కసారి వారు మా కోరికలు తెలుసుకొంటే గనక వారు కూడా వారి సంతోషాన్ని మాతో పంచుకోవడము మొదలుపెడతారు. అవును, అణగారిన వర్గాలతో ఆనందం పంచుకోవడం కోసం పిఆర్ఏ చాలా ఉపయోగపడుతుంది. పిఆర్ఏ మన మధ్య అన్ని మర్యాదలను/పద్ధతులను నిర్మూలిస్తుంది మరియు పిఆర్ఏ వారి ఆలోచనా విధానం ప్రకారం పని సాగే విధముగా తోడ్పడుతుంది.”

ఒకానొక వీడీసీలోని (గ్రామీనాభివృద్ధి కమిటీ) అధ్యక్షుడు (చైర్ పర్సన్) పధకము తయారీలో పిఆర్ఏ వాడిన అనుభవాన్ని మాతో పంచుకొన్నాడు.

“పిఆర్ఏకి ముందు మేము కోరికల చిట్టాను ప్రతీ వార్డు సభ్యుడు నుండి తీసుకొనేవారము. అప్పట్లో మా బల్ల ఎంతో బాధను అనుభవించేది – ప్రతీ వార్డ్ సభ్యుడూ కూడా తమ వారి కోరికలే ఎంతో ముఖ్యమైనవి అని బల్లను గుద్ది నిరూపించడానికి ప్రయత్నించేవారు! కానీ, ఇద్దరిద్దరిని కలిపి ప్రాముఖ్యతలను నమోదు చేసుకోవడము మొదలుపెట్టిన దగ్గర నుండి మా బల్ల బతికిపోయింది. ఈ మధ్య మేము ప్రాముఖ్యతలను ఆనందముగా నమోదు చేసుకొంటున్నాము.”

ఈ ప్రక్రియ వల్లనే అనుభవపూర్వకంగా నేను ఇప్పటి వరకూ నేర్చుకున్నది ఏమిటంటే పిఆర్ఏ మన ఆనందాన్ని గ్రామస్తులతో పంచుకొనేందుకు దోహద పడుతుంది మరియు వారి ఆనందాన్ని మనతో పంచుకోవడానికి దోహదపడుతుంది, అలాగే ముఖ్యముగా సంఘములోని అణగారిన వారితో కూడా. ఒక ప్రక్రియ (ఏ ప్రక్రియ అయినా సరే) యొక్క మంచి ఫలితాల గురించి ఆలోచించడం మనల్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తుంది. చెడు ఫలితాల గురించి మాత్రమే ఆలోచించడం వలన మన దారులు మూసుకుపోతాయి; చెడు మీద మాత్రమే దృష్టి పెట్టి మనం ముందుకు సాగలేము.

కమల్ ఫుయాల్
నేపాల్
“పాల్గొనుటకు వివిధ దారులు” అనే ఐడీఎస్ (IDS) శిక్షణా తరగతిలో ప్రవేశపెట్టిన పత్రము.

––»«––

© ప్రచురణ హక్కు 1967, 1987, 2007 ఫిల్ భర్ట్లె
వెబ్ రూపకర్త లోర్డస్ సడా
––»«––
చివరగా మార్చబడిన తేది: 2011.12.18

 హోం పేజి

 వెల నిశ్చయిన్చుటలో పాల్గొనుట